ఎల్.బీ.నగర్ లో నిర్మిస్తున్న టిమ్స్ ఆసుపత్రికి రావి నారాయణ రెడ్డి పేరు పెట్టాలి : మాజీ ఎం.పీ. బోయినపల్లి వినోద్



రావి నారాయణ రెడ్డి జీవితం అందరికి స్ఫూర్తి దాయకం

** ఎల్.బీ.నగర్ లో నిర్మిస్తున్న టిమ్స్ ఆసుపత్రికి రావి నారాయణ రెడ్డి పేరు పెట్టాలి : మాజీ ఎం.పీ. బోయినపల్లి వినోద్ కుమార్

తెలంగాణ సాయుధ పోరాట రథ సారథి, పద్మవిభూషణ్ స్వర్గీయ రావి నారాయణ రెడ్డి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా యువత ముందుకు సాగాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని మాజీ ఎం.పీ. బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. 

హైదరాబాద్ బంజారా హిల్స్ లోటస్ పాండ్ లోని రావి నారాయణ రెడ్డి ఆడిటోరియంలో  జరిగిన స్వర్గీయ రావి నారాయణ రెడ్డి 118వ జయంతి కార్యక్రమంలో వినోద్ కుమార్ పాల్గొన్నారు.

ఈ సందర్బంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ ఎల్. బీ. నగర్ కొత్తపేట వద్ద నిర్మిస్తున్న ప్రభుత్వ టిమ్స్ ఆసుపత్రికి రావి నారాయణ రెడ్డి పేరు పెట్టాలని, విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలని అన్నారు.

 నిజాం ప్రభుత్వ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా, ప్రజల విముక్తి కోసం రావి నారాయణ రెడ్డి సాయుధ పోరాటానికి నాయకత్వం వహించారని అన్నారు. అప్పటి కేంద్ర హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆధ్వర్యంలో పోలీస్ యాక్షన్ జరగడం వల్ల సాయుధ పోరాటానికి ఆటంకం ఏర్పడిందని పేర్కొన్నారు. పోలీస్ యాక్షన్ జరగక పోయినా నిజాం ప్రభుత్వ సంగతి చూసేవాళ్ళం అని రావి నారాయణ రెడ్డి చెప్పేవారని వినోద్ కుమార్ తెలిపారు. 

ప్రస్తుతం పేద, ధనికుల మధ్య ఆర్ధిక పరమైన వ్యత్యాసం వేయి రెట్లు పెరిగిపోయిందని, కొన్ని దశాబ్దాల క్రితం 65% మంది వద్ద డబ్బులు ఉండేవని, ఇప్పుడు సంపద కొంత మంది వద్దే కేంద్రీకృతమైందని వినోద్ కుమార్ అభిప్రాయపడ్డారు. రావి నారాయణ రెడ్డి చూపిన మార్గంలో యువత పయనిస్తే ఏమైనా సాధించవచ్చని వినోద్ కుమార్ అన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి, ప్రెస్ అకాడమీ చైర్మన్ కే. శ్రీనివాస్ రెడ్డి, సిపిఐ రాష్ట్ర నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments